మూసీ పరీవాహకంలో మార్కింగ్ మొదలు..
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 26: రాజధానిలో మూసీ నది పరీవాహక ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది. భారీ పోలీసు బందోబస్తు మధ్య అధికారులు సర్వే చేపట్టారు. మూడు జిల్లాల పరిధిలో మొత్తం 25 ప్రత్యేక సర్వే బృందాలు పర్యటిస్తున్నాయి. హైదరాబాద్ జిల్లా పరిధిలో 16 బృందాలు, రంగారెడ్డి జిల్లాలో నాలుగు, మేడ్చల్‌లో 5 బృందాలు సర్వే చేస్తున్నాయి. నదీ గర్భంలోని నిర్వాసితుల నిర్మాణాల వివరాలను రెవెన్యూ అధికారులు అడిగి తెలుసుకున్నారు. మూసీ నదిలో ఉన్న బఫర్ జోన్‌లోని నిర్మాణాలకు మార్కింగ్ చేస్తున్నారు. చాదర్‌ఘాట్, మూసానగర్, శంకర్‌నగర్‌లోని మూసీ పరీవాహక ప్రాంతాల్లో అధికారులు సర్వే చేపట్టారు. హిమాయత్‌నగర్ తహసీల్దార్ సంధ్యారాణి ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ కొనసాగుతోంది. గోల్కొండ పరిధిలోని ఇబ్రహీంబాగ్, లంగర్‌హౌస్ డిఫెన్స్ కాలనీలో అధికారులు సర్వే చేస్తున్నారు. రివర్ బెడ్‌లో నిర్మాణాలకు మార్కింగ్ చేస్తున్నారు. ఇప్పటికే 13 వేలకుపైగా ఆక్రమణలను ప్రభుత్వం గుర్తించింది. అర్హులైన పేదలకు పునరావాసం కల్పించేందుకు వివరాలు సేకరిస్తున్నారు. ముసీ సుందరీకరణలో భాగంగా నదీ పరిసరాల్లో సుమారు 40 వేల ఇండ్లు తొలగించనున్నారు.
మరోవైపు ఆపరేషన్ మూసీ పనులు జోరందుకున్నాయి. మూసీ ప్రక్షాళనపై రాష్ట్ర సర్కార్ స్పీడ్ పెంచింది. మూసీ వద్ద ఉన్న ఆక్రమణలు తొలగించిన వెంటనే సుందరీకరణ పనులపై ప్రభుత్వం దృష్టిసారించింది. ఇందులో భాగంగా మూసీ నిర్వాసితుల గుర్తింపు కోసం సర్వే కొనసాగుతోంది. పునరావాసం తర్వాతే ఇళ్ళు కూల్చివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అర్హులైన కుటుంబాలకు డబుల్ బెడ్రూం ఇళ్ళు ఇవ్వాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. మూసీ నదిని ఆక్రమణల నుంచి విడిపించేందుకు సర్కార్ చర్యలు చేపట్టింది. మూసీ రివర్ బెడ్‌లో 2,166 ఇళ్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అయితే అత్యధికంగా హైదరాబాద్ జిల్లా పరిధిలో ఆక్రమణలను అధికారులు గుర్తించారు. మరోవైపు మూసీ నివాసితుల ప్రాంతాల్లో ఉదయం నుంచి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మూసీ బాధితుల వివరాలు సేకరించడానికి అధికారులు రంగంలోకి దిగగా.. నివాసులు అడ్డుకుంటున్నారు. గురువారం ఉదయం మూసీ రివర్ బెడ్‌లో 25 ప్రత్యేక సర్వే బృందాలు చేరుకున్నాయి.
ఒక్కో టీమ్‌లో తహసీల్దార్‌తో పాటు ఐదుగురు ఆఫీసర్లు ఉన్నారు. రివర్ బెడ్‌లో మొత్తం 2,166 ఇళ్లను అధికారులు గుర్తించారు. ఎఫ్‌టీఎల్ నిర్మాణాలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు.. బఫర్ జోన్‌లో నిర్మాణాలకు ఇళ్ళతో పాటు నష్టపరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అయితే పలు ప్రాంతాల్లో సర్వేకు వొచ్చిన అధికారులను స్థానికులు అడ్డుకుంటున్నారు. దీంతో మూసీ నివాసితుల సర్వే అధికారులకు సవాల్‌గా మారింది. భారీ పోలీసు బందోబస్తు మధ్య ఇళ్లను అధికారులు మార్క్ చేస్తున్నారు. మూసీ ఆక్రమణలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆక్రమణలను తొలగించేందుకు ప్రత్యేక కార్యాచరణను రూపొందించినట్లు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీ దాన కిషోర్ తెలిపారు. ఈ నిర్మాణాలను తొలగించాలని నిర్ణయించినట్లు చెప్పారు. అయితే, ఇందుకోసం మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా ఒక కార్యాచరణను రూపొందించినట్లు దాన కిశోర్ తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రతి ఒక్క నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంజూరు చేసి పునరావాసం కల్పిస్తామని ప్రకటించారు.