-
ఈనెల 28న ‘చలో దిల్లీ’కి పిలుపునిచ్చామన్న బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి
- జగన్ సీఎం అయ్యాక రాయలసీమకు అత్యంత అన్యాయం జరిగిందని విమర్శ
- కుటుంబాల్లో జగన్ చిచ్చు పెడుతున్నారని మండిపాటు
- అమ్మ ఒడి, తాత గోచి పేరుతో మాయ చేస్తున్నారని వ్యంగ్యాస్త్రాలు
నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఈనెల 28న ‘చలో దిల్లీ’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు రాయలసీమ స్టీరింగ్ కమిటీ చైర్మన్ బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. ఒక్క చాన్స్ అని చెప్పిన సీఎం జగన్.. రాయలసీమకు ఏమీ చేయలేదని విమర్శించారు. జగన్ సీఎం అయ్యాకే తమకు అత్యంత అన్యాయం జరిగిందని మండిపడ్డారు.
‘‘అప్పర్ భద్ర వల్ల రాయలసీమ నాశనమవుతోందని కేంద్రానికి ఎందుకు చెప్పలేదు? సొంత పార్టీ ఎంపీ కుటుంబాన్ని కిడ్నాప్ చేస్తే దిక్కులేదు. చిన్న వయసులో సీఎం అయిన జగన్ ఇంత ఘోర వైఫల్యమా? కడప ఉక్కు ఫ్యాక్టరీకి శంకుస్థాపనే తప్ప చేసిందేమీ లేదు” అని విమర్శించారు.
కొంతమంది బైరెడ్డి అనే పేరుతో తోలు కప్పుకొని దందాలు చేస్తున్నారని రాజశేఖర్‌రెడ్డి మండిపడ్డారు. కుటుంబాల్లో జగన్ చిచ్చు పెడుతున్నారని, పెద నాన్న, చిన్నాన్నలపైకి అబ్బాయిలను ఎగదోస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నలుగురు కలిస్తే చిన్నాయన, పెద్దాయన కథలే చెప్పుకుంటున్నారన్నారు.
‘‘ఎందుకూ పనికి రాని కేబుల్ బ్రిడ్జి ఎందుకు? సెల్ఫీలు దిగడానికా? సీఎంకు లేఖలు రాసినా పట్టించుకోరు.. వినిపించుకోరు. జగన్ చెవిలో సీసం పోసుకున్నారు కాబట్టి సేవ్ రాయలసీమ పేరుతో పోరాటం చేస్తాం. మా రాయలసీమ హక్కుల కోసం జులై 28న ఛలో ఢిల్లీకి పిలుపునిచ్చాం’’ అని ఆయన వెల్లడించారు.
అమ్మ ఒడి, తాత గోచి పేరుతో మాయ, మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఎలిమెంటరీ స్కూల్ వ్యవస్థను జగన్ నాశనం చేశారన్నారు. చిన్న బాల శిక్ష, పెద్ద బాల శిక్ష మన పెద్దలు ఆచారంగా పెట్టి వెళ్లారని.. ఇప్పుడు ఆ బాల శిక్ష అంటే ఏమిటో పిల్లలకు తెలియకుండా చేశారని అన్నారు. ఒక వైపు బటన్ నొక్కడం.. మరో వైపు కత్తిరించడమే జగన్ పాలన అంటూ విమర్శలు గుప్పించారు.