A place where you need to follow for what happening in world cup

పనికిరాని మంత్రులు ఉన్నా ఒకటే.. లేకున్నా ఒకటే: బీఆర్ఎస్

ఖమ్మం జిల్లా మంత్రులపై బీఆర్ఎస్ ఆగ్రహం
పెద్దవాగు ప్రాజెక్టు కొట్టుకుపోయి రూ.100 కోట్ల నష్టం వాటిల్లిందని వెల్లడి
శాఖలమీద పట్టులేని మంత్రుల కారణంగా గండి పడిందని విమర్శ
గ్రామాల్లోకి నీరు వచ్చిందని, వందల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని వెల్లడి

పనికిరాని మంత్రులు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అంటూ బీఆర్ఎస్ తన అధికారిక ఎక్స్ హ్యాండిల్ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది. ఖమ్మం జిల్లా మంత్రుల నిర్లక్ష్యం కారణంగా పెద్దవాగు ప్రాజెక్టు కొట్టుకుపోయిందని, దీంతో రూ.100 కోట్ల నష్టం వాటిల్లిందని పేర్కొంది. శాఖల మీద పట్టులేకపోవడంతో, అనుభవరాహిత్యంతో జిల్లాను భ్రష్టు పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది.

జిల్లాకు చెందిన మొదటి మంత్రి… పేరుకే ఉపముఖ్యమంత్రి అని, కానీ ఆయనను ఎవరూ పట్టించుకోరని పేర్కొంది. రెండో మంత్రి ముద్దుపేరు గడియారాల మంత్రి అని, ఎన్నికలు వచ్చినా… వేడుక జరిగినా గడియారాలు పంచడం ఆయన హామీ అని విమర్శించింది. ఇక మూడో మంత్రికి శాఖాపరమైన సమావేశాలలో కూడా చోటు ఉండదని… ఇది ఆయన స్పెషాలిటీ అని ఎద్దేవా చేసింది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పెద్దవాగు ప్రాజెక్ట్ గేట్ల దగ్గర భారీ గండిపడిందని, దీంతో పెద్దవాగు ప్రాజెక్టు పూర్తిగా ఖాళీ అయిందని తెలిపింది. పెద్దవాగుకు గండిపడటంతో నీళ్లు గ్రామాల్లోకి వచ్చాయని, దీంతో వందల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని తెలిపింది. భారీ వర్షం కారణంగా రాత్రికి రాత్రే వరద ముంచెత్తి… ఇళ్లు కూలాయని, వందల సంఖ్యలో పశువులు మృతి చెందాయని పేర్కొంది. కాంగ్రెస్ అసమర్థ పాలనకు ఇది పరాకాష్ఠ అని పేర్కొంది.

Leave A Reply

Your email address will not be published.