ప్రభుత్వ పాఠశాలల్లో ‘ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ ’ విధానం అమల్లోకి రానుంది. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తి కావటంతో…. సెప్టెంబర్ నెల నుంచి ఈ విధానాన్ని అమలు చేసే దిశగా సర్కార్ అడుగులు వేస్తోంది.ఇక సర్కార్ పాఠశాలల్లో ‘ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్’ విధానం అమల్లోకి రానుంది. ఈ విధానంపై ఇప్పటికే సర్కార్ కసరత్తు ప్రారంభించిన సంగతి తెలిసిందే. కీలమైన సాఫ్ట్ వేర్ టెండర్ల ప్రక్రియ పూర్తి కావటంతో… పాఠశాలల్లో ఈ విధానం అమలుపై సర్కార్ ఫోకస్ పెట్టింది. రాష్ట్రంలోని అన్ని సర్కార్ పాఠశాలల్లో సెప్టెంబర్ మాసం నుంచి ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ ను ప్రారంభించే దిశగా అడుగులు వేస్తోంది. ఈ విధానం అమల్లోకి వస్తే విద్యార్థులు, టీచర్లతో పాటు ఇతర సిబ్బంది కూడా దీని ద్వారనే హాజరును నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
గుజరాత్, ఢిల్లీ, నాగాలాండ్, ఆంధ్రప్రదేశ్ తో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో ఫేషియల్ రికగ్నిషన్ విధానం ఇప్పటికే అమలవుతున్నది. ఇదే క్రమంలో తెలంగాణ సర్కార్ కూడా ఆ దిశగా ఆలోచన చేసింది. పలు పాఠశాలలను ఎంచుకొని పైలెట్ ప్రాజెక్ట్ ను కూడా అమలు చేసింది. ఫలితాలు ఆశాజనకంగా ఉన్నందున రాష్ట్రమంతటా అమలు చేయాలనే నిర్ణయానికి వచ్చింది. ఆ తర్వాత టెండర్లను కూడా పిలిచింది. మరోవైపు ఇప్పటికే టీచర్లకు ట్యాబ్‌ల పంపిణీ పూర్తయింది.ప్రస్తుతం సాఫ్ట్‌వేర్‌ను ట్యాబ్‌లలో నిక్షిప్తం చేస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తికాగానే… ముఖ ఆధారిత హాజరు విధానం అమలుచేయాలని అధికారులు భావిస్తున్నారు. ఇది పూర్తిగా ఏఐ ఆధారంగా పనిచేస్తుంది.స్మార్ట్‌ఫోన్/ ట్యాబ్‌లలో యాప్‌ను ఇన్‌స్టాల్ చేసి… కెమెరా ఆధారంగా స్కాన్ చేయగానే ముఖాలను గుర్తించి దానికదే హాజరు నమోదు చేస్తుంది.
వెయ్యిలోపు విద్యార్థులున్న బడికి ఒకటి, వెయ్యి మంది కంటే అధికంగా ఉన్న స్కూళ్లకు రెండు ట్యాబ్‌లను పంపిణీ చేశారు. ఈ ట్యాబ్‌లలో ఫేషియల్ రికగ్నిషన్ యాప్‌ను నిక్షిప్తం చేసి, వీటి ఆధారంగా హాజరును నమోదుచేస్తారు. ప్రధానంగా ట్యాబ్ లలో విద్యార్థులు, టీచర్ల యాప్‌లో లోడ్‌చేస్తారు. ఫలితంగా క్లాస్ టీచర్ స్మార్ట్‌ఫోన్/ ట్యాబ్ కెమెరాను తెరిచి మొత్తాన్ని స్కాన్ చేయగానే ఎఫ్‌ఆర్‌ఎస్ అప్లికేషన్, కాగ్నిటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగించి, డాటాబేస్‌లో ఉన్న చిత్రాలో పోల్చుకుంటుంది. ఆయా ముఖాల ఆధారంగా క్లాసుకు ఎంత మంది హాజరయ్యారనే దానిపై లెక్క తేలుస్తుంది. తక్కువ హాజరుశాతం ఉంటే అలర్ట్ కూడా జారీ చేసే విధానం ఇందులో ఉంటుంది.ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతేడాది నుంచి ఈ విధానం అమలు చేస్తున్నప్పటికీ అనేక ఇబ్బందులు తలెత్తాయి.కీలకమైన అన్ని శాఖల్లో ఈ తరహా విధానం అమల్లోకి రావటంతో… సర్వర్ ఇబ్బందులు వచ్చాయి. సాంకేతికపరంగా తలెత్తిన సమస్యలను అధిగమిస్తూ వచ్చింది ఏపీ సర్కార్.