సోషల్ మీడియాలో ఈ మధ్య కంటెంట్ క్రియేటర్లు కట్టుతప్పుతున్నారు. హాస్యానికి, అసభ్యతకు మధ్య తేడా గుర్తించలేక ఫన్ పేరిట నోటికొచ్చినట్టు మాట్లాడుతూ వివాదాలకు కారకులవుతున్నారు. తాజాగా ప్రముఖ నటుడు మంచు మనోజ్ ఓ కంటెంట్ క్రియేటర్‌పై ఎక్స్ వేదికగా మండిపడ్డారు. ప్రణీత్ అనే నటుడు తన ఇద్దరు స్నేహితులతో కలిసి చేసిన ఓ వీడియోపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ తండ్రీకూతుళ్ల వీడియోపై ప్రణీత్ ఇష్టారీతిన వ్యాఖ్యలు చేశాడు. అసభ్యకరమైన వర్ణనలు జోడించాడు. ఇప్పటికే ఈ వీడియోపై మెగా హీరో సాయి ధరమ్ తేజ్ స్పందించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యుటీ సీఎం భట్టి విక్రమార్క్ కూడా రియాక్ట్ అయ్యారు.
ఇక మంచు మనోజ్ తన పోస్టులో తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. ‘‘హస్యం పేరిట ఇలాంటి వ్యక్తులు ద్వేషం, వేధింపుల ధోరణిని వ్యాప్తి చేయడం దారుణం. భరించలేకుండా ఉన్నా. ఈ ప్రవర్తన రోతపుట్టించేదే కాకుండా ప్రమాదకరమైదని కూడా. సంవత్సరం క్రితం, నేను ఏపీ, తెలంగాణలో మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై పోరాటానికి అతడి మద్దతు కోరుతూ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా సంప్రదించాను. అతడి ఛానల్ పాప్యులారిటీ కారణంగా సమాజంపై మరింత మంచి ప్రభావం పడుతుందని అనుకున్నాను. కానీ అతడి నుంచి ఏ స్పందన రాలేదు. ఈ రోజు అతడు చిన్నారుల గురించి నీచమైన కామెంట్స్ చేస్తున్నాడు. పిల్లల, మహిళ భద్రతకే మన తొలి ప్రాధాన్యం. ఇలాంటి సందర్భాల్లో మౌనంగా, క్రియారహితంగా ఉండటం సరికాదు. ఇలాంటి వాళ్లపై తక్షణ చర్యలు తీసుకోవాలంటూ తెలంగాణ సీఎం, డిప్యుటీ సీఎంను కోరుతున్నాను’’ అని ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని అమెరికా పోలీసులతో పాటు భారత్‌లో అమెరికా ఎంబసీ వారిని కూడా మంచు మనోజ్ అభ్యర్థించారు.