A place where you need to follow for what happening in world cup

ఇండియా కూటమి విధానాలతో మోడీకి భయం పట్టుకుంది

  •  సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
  • మతోన్మాదానికి వ్యతిరేకం గల పార్టీలతో పొత్తుకు సిద్ధం: తమ్మినేని వీరభద్రం

మతోన్మాద బిజెపికి వ్యతిరేకంగా సిపిఎం మొదటి నుండి ఖచ్చితమైన అభిప్రాయాన్ని కలిగి ఉందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. మంగళవారం నల్గొండ జిల్లా నిడమనూరు మండలంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి ప్రమాదకరమైన బిజెపి ఎదుగుదలను నిలువరించడమే సిపిఎం లక్ష్యం అని, బిజెపి, దాని అనుబంధ సంఘాల విధానాలకు, మోడీ నియంతృత్వానికి వ్యతిరేకంగా ఎవరు పని చేసినా వారికి మా సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. మాతో సారూప్యం గల పార్టీలు ఏదైనా ఉంటే వాటితో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. దేశంలో మోడీ పతనం ప్రారంభమైందని ఇండియా కూటమి విధానాలతో మోడీకి భయం పట్టుకుందన్నారు. ఇండియా అని పేరును మార్చి భారత్ పిలవాలని మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అతని భయానికి ఉదాహరణ అని, ఇండియా కూటమి పేరును ఉచ్చరించడానికి భయపడుతున్నారన్నారు.

దేశం పేరు మారిస్తే దేశ ప్రజల బతుకులు మారుతాయ అని ప్రశ్నించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకురావడం హర్షనీయమైనప్పటికీ అమలు కు కాలయాపన సరైనది కాదన్నారు. ఈ బిల్లు పేరుతో మహిళల్లో సానుభూతి పొందాలని ఆలోచన, దాని అమలులో చిత్తశుద్ధి లేకపోవడం దేశ ప్రజలు గమనిస్తున్నారని, దేశంలో జన గణన తో పాటు కుల గణన జరగాలని ఆయన అన్నారు. గతంలో తెలంగాణలో కూడా బిజెపి పాగా వేసి అధికారంలోకి రావాలని కుట్రలు చేసిందని, దానిని కమ్యూనిస్టులు అడ్డుకున్నారని అన్నారు. మునుగోడు ఉప ఎన్నికలకు ముందు బిజెపికి వ్యతిరేకంగా మాట్లాడిన కేసీఆర్ ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారని, మా వైఖరిలో మార్పు లేదని స్పష్టం చేశారు. బిజెపికి అనుకూలంగా ఇప్పుడు కేసీఆర్ మాట్లాడుతున్నారని, ఎన్డీఏ అధికారంలోకి వస్తే మా భాగస్వామ్యంతోనే సాధ్యమనే మాటలు టిఆర్ఎస్ పార్టీ మంత్రులనోట వింటున్నామని, ప్రజలు ద్వంద వైఖరిని గమనిస్తున్నారని ఆయన అన్నారు.

ఇండియా కూటమిలోని ప్రధాన భాగస్వామి అయిన కాంగ్రెస్ ఇచ్చిన హామీలతో బిఆర్ఎస్ బెంబేలు ఎత్తు తుందని, కాంగ్రెస్ ఇచ్చిన హామీలను విమర్శించడం తప్ప బిఆర్ఎస్ కొత్తగా హామీలు ఇవ్వలేకపోతుందని హేళన చేశారు. దీనికి కారణం గతంలో ఇచ్చిన హామీలే అమలు చేయలేకపోయారని అన్నారు. సిపిఎం దేశవ్యాప్తంగా ఇండియా కూటమితో కలిసి పనిచేస్తుందని, తెలంగాణలో పార్టీ నిర్ణయించుకున్న స్థానంలో పోటీలో ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, పోతినేని సుదర్శన్, జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు తుమ్మల వీరారెడ్డి, బండా శ్రీశైలం, చినపాక లక్ష్మీనారాయణ, పాలడుగు నాగార్జున, ఎండి హషం, జిల్లా కమిటీ సభ్యులు కంబాలపల్లి ఆనందు, ఎండి సలీం, కొండేటి శ్రీను, అవుతా సైదులు, మండల కార్యదర్శి కందుకూరి కోటేష్, కత్తిలింగారెడ్డి, కుర్ర శంకర్, కోమండ్ల గురువయ్య, మలికంటి చంద్రశేఖర్, వింజమూరు శివ, ఆకారపు నరేష్, ఇంజమూరి పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.