- బినామీల చేతుల్లో రూ. 10 కోట్ల ఇసుక
- ఓవర్ లోడింగ్ తో మరో రూ. 10 కోట్లకు స్కెచ్
- రంగు మార్చిన గులాబీ కాంట్రాక్టర్లు
పూర్వపు ఖమ్మం జిల్లాకు చెందిన ఒక ఫిరాయింపు ఎమ్మెల్యేకి ఇసుక నజరానాగా లభించింది. ఆదివాసీ మహిళా సహకార సంఘానికి కేటాయించిన ఇసుకను ఎమ్మెల్యే అనుచరులైన కొందరు బినామీ కాంట్రాక్టర్లు చేజిక్కించుకున్నారు. ఈ వ్యవహారమంతా జిల్లాకు చెందిన ఒక మంత్రి ప్రమేయంతో జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం రాక ముందే చర్ల ప్రాంతానికి చెందిన ఈ ఇసుక రీచ్ కి అనుమతులు వచ్చాయి. రెండు మూడు రోజులు నడిచిన తర్వాత ఈ ఇసుక రీచ్ ని నిలిపివేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఈ రీచ్ ని నిలిపివేయాలని మంత్రి ఆదేశించినట్టు జిల్లా కలెక్టర్ కింది స్థాయి అధికారులకు తెలిపారు. బీఆర్ఎస్ నేతలతో అంటకాగిన కాంట్రాక్టర్లు ఈ ఇసుక రీచ్ ని మంజూరు చేయించారనే అక్కసుతో మంత్రి రీచ్ నడవకుండా అడ్డుపడినట్టు తెలిసింది.
దీనితో ఆ మంత్రిని, ఆయన అనుచరుడైన స్థానిక ఎమ్మెల్యేని ప్రసన్నం చేసుకునే పనిలో కాంట్రాక్టర్లు నిమగ్నమయ్యారు. బీఆర్ఎస్ టిక్కెట్ పై గెలిచి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే విజయానికి కృషి చేసిన చర్ల ప్రాంతానికి చెందిన ఒక కాంట్రాక్టర్ సహాయంతో లాబీయింగ్ మొదలు పెట్టారు. కాసులు కురిపించే ఈ రీచ్ పై మంత్రి అనుచరుల కన్ను పడింది. మంత్రిపై ఒత్తిడి పెరగడంతో నాలుగు నెలల పాటు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. తనకు ఆదాయం వచ్చే ఈ రీచ్ ని తన మనుషులకు వదలివేయాలని ఎమ్మెల్యే బతిమాలడంతో ఎట్టకేలకు ఈ రీచ్ ని ఎమ్మెల్యే మనుషులకు కేటాయించారు. పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు అత్యంత సన్నిహితుడిగా ఉండి పదేండ్ల కాలం ఇసుక రీచ్ లను దక్కించుకున్న కాంట్రాక్టర్ తెర వెనుక వ్యవహారమంతా నడిపించారు. ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ రూ. 20 కోట్లకు పైగా ఆదాయం వచ్చే ఈ ఇసుక రీచ్ కేటాయింపులకు గానూ ఎమ్మెల్యేకి భారీ వాటా దక్కినట్టు కాంగ్రెస్ నేతలే అంటున్నారు.
అంతా అక్రమమే..
ఏజెన్సీ ప్రాంతాలకు పంచాయితీరాజ్ విస్తరణ (పీసా) చట్టం ప్రకారం ఇసుక రీచ్ లను స్థానిక ఆదివాసీ సహకార సంఘానికి కేటాయించాల్సి ఉంది. గ్రామసభ సమావేశం ఏర్పాటు చేసి అర్హత పొందిన సహకార సంఘాన్ని ఎంపిక చేసే విధానం గతంలో ఉండేది. ఈ విధానానికి స్వస్తి చెప్పి జిల్లా కలెక్టర్ తుది ఉత్తర్వులను జారీ చేశారు. ఇసుక తీయడానికి, లోడింగ్ పనుల కోసం క్యూబిక్ మీటర్ కు రూ. 116 ధరగా నిర్ణయించగా ఆదివాసీ సహకార సంఘానికి కేవలం రూ. 30 మాత్రమే చెల్లించే విధంగా అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇసుక సర్వే నుంచి ధర నిర్ణయం వరకూ రేగా కాంతారావు అనుచరుడైన కాంట్రాక్టర్ చెప్పిన విధంగానే జరిగింది. ఏజెన్సీ ప్రాంతంలో ఇసుక తవ్వకాలను తెలంగాణ ఖనిజాభివృద్థి సంస్థకు కేటాయించగా ఆ సంస్థ ఆదివాసీ సహకార సంఘంతో మరో ఒప్పందం కుదుర్చుకుంటుంది. ఒప్పందంలోని నిబంధనల ప్రకారం ఇసుక తవ్వకాలు, లోడింగ్ వ్యవహారాలన్నీ సహకార సంఘమే చూసుకోవాలి. మూడవ పార్టీతో ఎటువంటి ఒప్పందాలు చేసుకోరాదు.
కానీ బినామీ కాంట్రాక్టర్లు రంగ ప్రవేశం చేసి రీచ్ ని నిర్వహిస్తున్నారు. ఇదంతా జిల్లా కలెక్టర్ కనుసన్నల్లోనే జరుగుతున్నది. బినామీ కాంట్రాక్టర్ల వ్యవస్థకు స్వస్తి పలకాలని, ఆదివాసీ సహకార సంఘమే ఇసుక రీచ్ ని నిర్వహించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిని ఆదివాసీ సంఘాలు కోరాయి. అయినా ఫలితం శూన్యం. మంత్రి, ఎమ్మెల్యే హస్తం ఉండటంతో వారు నోరు మెదపలేక పోతున్నారు. బినామీ కాంట్రాక్టు వ్యవహారంపై న్యాయ పోరాటానికి ఆదివాసీ సంఘాలు సమాయత్తమవుతున్నాయి.