రోడ్డు పక్కన నిలిపి ఉంచిన ట్రాలీ లారీని ఓ కారు వేగంగా ఢీ కొట్టింది. దీంతో కారులో ఉన్న నలుగురు అక్కడికక్కడే చనిపోగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు జిల్లాలో చోటుచేసుకుందీ ఘోర ప్రమాదం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని ద్వారకాతిరుమల మండలం లక్ష్మి నగర్ వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కనే నిలిపి ఉంచిన ట్రాలీ లారీని ఎర్టిగా కారు అతివేగంగా ఢీ కొట్టింది. దీంతో కారులో ఉన్న రాచభత్తుని భాగ్యశ్రీ (26), బొమ్మ కమలాదేవి (53), నాగ నితిన్ కుమార్ (5) అక్కడికక్కడే చనిపోయారు. దుర్గా వంశీతో పాటు బాలుడు నాగ షణ్ముక్ తీవ్రంగా గాయపడ్డారు.
ప్రమాదంపై సమాచారం అందడంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నట్లు పోలీసులు తెలిపారు. కారులో చిక్కుకున్న మృతదేహాలను స్థానికుల సాయంతో వెలికి తీశామని చెప్పారు. తీవ్ర గాయాలపాలైన ఇద్దరిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. డెడ్ బాడీలను పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు వివరించారు. మృతులు రాజవోలుకు చెందినవారని, హైదరాబాద్ కు వెళ్లి తిరిగి వస్తున్నారని పోలీసులు తెలిపారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నట్లు వివరించారు.